: లోక్ సత్తా నుంచి కటారి, డీవీవీఎస్ సస్పెన్షన్... జాతీయ కమిటీ నిర్ణయంపై నేడు కీలక భేటీ
లోక్ సత్తా పార్టీలో అంతర్గత విభేదాలు మరింత ముదిరాయి. సార్వత్రిక ఎన్నికల అనంతరం పార్టీలో పొడచూపిన విభేదాలు సద్దుమణిగాయనుకుంటున్న తరుణంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు సురేంద్ర శ్రీవాస్తవ నిన్న సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీ జాతీయ కమిటీ సభ్యుడు కటారి శ్రీనివాసరావు, ఏపీ శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డీవీవీఎస్ శర్మ, రమేశ్ రెడ్డిలను పార్టీ నుంచి బహిష్కరించారు. ఈ మేరకు నిన్న కటారి, డీవీవీఎస్, రమేశ్ రెడ్డిలతో పాటు పార్టీ నేతలకు సస్పెన్షన్ కు సంబంధించిన సమాచారాన్ని చేరవేశారు. అయితే నామినేటెడ్ జాతీయ కార్యవర్గాన్ని సంస్థాగత ఎన్నికల ద్వారా ఎన్నికైన తాము గుర్తించేది లేదని డీవీవీఎస్ ప్రకటించారు. తాము గుర్తించని జాతీయ కమిటీ, తమను బహిష్కరించడమేంటని కూడా ఆయన వ్యాఖ్యానించారు. అయితే జాతీయ కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని బుధవారం (నేడు) హైదరాబాదులో సమీక్షించనున్నామని, భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తామని ఆయన నిన్న వెల్లడించారు.