: రాజన్న దర్శనంతో పదవీ గండమట... వేములవాడ వైపు కన్నెత్తి చూడని అమాత్యులు!


వేములవాడ రాజరాజేశ్వర స్వామికి మహాశివరాత్రి పర్వదినాన పట్టు వస్త్రాలు సమర్పించేందుకు ఒక్క మంత్రికి కూడా తీరికలేకపోయింది. తీరిక లేకపోయింది అనే కంటే, సాహసం లేకపోయింది అంటే సరిగ్గా సరిపోతుందేమో. వివరాల్లోకెళితే... నిన్న జరిగిన శివరాత్రి ఉత్సవాలకు సంబంధించి రాజన్న ఆలయం ముస్తాబుకు తెలంగాణ ప్రభుత్వం దాదాపు రూ. కోటిని ఖర్చు చేసింది. ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి హోదాలో అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించాల్సి ఉంది. ఇందుకోసం నిజామాబాదు జిల్లా కలెక్టర్ నీతూ కుమారి ప్రసాద్ ఏర్పాట్లు చేశారు. అయితే సమయం గడిచిపోతున్నా మంత్రి పత్తా లేదు. సరే ఇతర కార్యక్రమాల్లో ఇంద్రకరణ్ రెడ్డి బిజీగా ఉంటే, కనీసం జిల్లాకు చెందిన మంత్రులన్నా రావాలిగా? వారి అడ్రెస్ కూడా లేదు. దీంతో చేసేదేమీ లేక కలెక్టరే స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయానికి మంత్రులెందుకు రాలేదన్న విషయంపై ఆరా తీస్తే అసలు విషయం వెలుగు చూసింది. రాజన్నకు పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రులతో పాటు జడ్పీ చైర్మన్ లు కూడా తమ పదవులను కోల్పోయారట. ఇటీవలే తెలంగాణ డిప్యూటీ సీఎంగా ఆలయానికి వచ్చిన తాటికొండ రాజయ్య కూడా పదవీ గండం నుంచి తప్పించుకోలేకపోయారట. ఈ భయాలతోనే మంత్రులు నిన్న రాజన్న ఆలయం వైపు కన్నెత్తి చూడలేదని తేలింది. మంత్రుల వైఖరిపై మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News