: సిద్ధేశ్వరాలయంలో సాధువు హఠాన్మరణం... కొన్ని గంటల పాటు ఆలయం మూసివేత
మహాశివరాత్రి వేడుకల్లో భాగంగా నెల్లూరు జిల్లా సీతారామపురం మండలంలోని సిద్ధేశ్వరాలయం కొద్ది గంటల పాటు మూతపడింది. ఆలయంలో పూజలు నిర్వహించేందుకు వచ్చిన ఓ సాధువు ఉన్నట్టుండి మృతి చెందాడు. దీంతో అక్కడ ఒక్కసారిగా కలకలం రేగింది. సాధువు మృతదేహాన్ని అక్కడి నుంచి తరలించిన అనంతరం కార్యక్రమాల కొనసాగింపుపై తర్జనభర్జన జరిగింది. ఆలయ ప్రాంగణంలో సాధువు మృతి నేపథ్యంలో ఆలయానికి సంప్రోక్షణ జరపాల్సిందేనని ఆలయ పండితులు నిర్ణయించారు. దీంతో కొంతసేపు ఆలయాన్ని మూసేసిన ధర్మకర్తల మండలి, సంప్రోక్షణకు ఏర్పాట్లు చేసింది. సంప్రోక్షణ అనంతరం ఆలయంలోకి భక్తులను యథావిధిగా అనుమతించారు.