: అమెరికా పోలీసుల కాల్పుల్లో మెక్సికన్ మృతి... మెక్సికన్ల ఆందోళనలతో ఉద్రిక్తత


ఆంగ్లం సరిగా మాట్లాడటం లేదన్న కారణంగా భారతీయుడిని చితకబాది, ఆయన పక్షవాతానికి గురయ్యేందుకు కారణమైన అమెరికా పోలీసులు మరో దుశ్చర్యకు పాల్పడ్డారు. ఈసారి ఏకంగా ఓ విదేశీయుడిని పొట్టనబెట్టుకున్నారు. నిష్కారణంగా అతడిపై కాల్పులు జరిపి, అతడి మృతికి కారణమయ్యారు. అమెరికాలోని వాషింగ్టన్ రాష్ట్రానికి చెందిన పాస్కో నగరంలో ఇటీవల చోటుచేసుకున్న ఈ ఘటనను ఓ వ్యక్తి తన సెల్ ఫోన్ లో చిత్రీకరించాడు. తాజాగా ఆ వీడియో బహిర్గతం కావడంతో అమెరికా పోలీసుల దమనకాండ వెలుగు చూసింది. అరెస్ట్ చేసేందుకు యత్నించిన తమపై రాళ్లు రువ్విన కారణంగానే మెక్సికోకు చెందిన ఆంటోనియో జాంబ్రానో మంటీస్ అనే వ్యక్తిపై కాల్పులు జరిపామని పోలీసులు చెప్పారు. అయితే చేతుల్లో ఎలాంటి ఆయుధాలు లేని ఆంటోనియో పోలీసులకు లొంగిపోయేందుకు చేతులెత్తేసినట్లు వీడియోలో ఉంది. వాస్తవం వెలుగు చూడటంతో మెక్సికో అధ్యక్షుడు ఎన్నిక్ పెనా నియాతో ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. అమెరికాలోని మెక్సికన్లు పాస్కోలో ఆందోళనలకు తెర తీశారు. రెండు రోజులుగా ఆ నగరంలో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది.

  • Loading...

More Telugu News