: ముంబయి సిద్ధివినాయక ఆలయంలో కేసీఆర్ పూజలు... కేక్ కట్ చేసిన కవిత
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు నేడు ముంబయిలోని సిద్ధివినాయక ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నేడు మహాశివరాత్రి పర్వదినం కావడంతో పాటు ఆయన జన్మదినం కూడా. ఈ మధ్యాహ్నం ఆయన మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ తో భేటీ అవుతారు. కాగా, కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను హైదరాబాదులోని తెలంగాణ భవన్ లో ఘనంగా నిర్వహించారు. ఆయన కుమార్తె, నిజామాబాద్ ఎంపీ కవిత కేక్ కట్ చేశారు. కేసీఆర్ పై సినీ దర్శకుడు శంకర్ రూపొందించిన పాటల సీడీని కవిత ఈ సందర్భంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు తలసాని, జగదీశ్ రెడ్డి, పార్లమెంటు కార్యదర్శి గ్యాదరి కిశోర్ తదితరులు పాల్గొన్నారు.