: ఎప్పుడు నేర్చుకుంటారు?... పాక్ ఆటగాళ్లపై మాజీల విమర్శలు
చిరకాల ప్రత్యర్థి భారత్ చేతిలో వరల్డ్ కప్ లో మరోసారి తమ జట్టు ఓడిపోవడాన్ని పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. అడిలైడ్ మ్యాచ్ లో ఎన్నో తప్పిదాలు జరిగాయని, యూనిస్ ఖాన్ ను ఓపెనర్ గా పంపడం భారీ తప్పిదమని, ఉమర్ అక్మల్ తో వికెట్ కీపింగ్ చేయించడం మరో తప్పు అని క్రికెట్ దిగ్గజం జహీర్ అబ్బాస్ అభిప్రాయపడ్డారు. ప్రణాళిక లేకుండా బరిలో దిగారని విమర్శించారు. అన్నింటికీ మించి, ఎన్నో క్యాచ్ లు నేలపాలు చేశారని అన్నారు. గత వరల్డ్ కప్ లోనూ ఎన్నో క్యాచ్ లు వదిలేశారని, ఎప్పుడు నేర్చుకుంటారని ప్రశ్నించారు. ఏడాది పొడవునా క్రికెట్ ఆడుతుంటారని, క్యాచ్ లు పట్టడం నేర్చుకోకుండా వారికి ఏ అంశం అడ్డుపడుతోంది? అని మండిపడ్డారు. ఇక, స్పిన్ లెజెండ్ సక్లయిన్ ముస్తాక్ కూడా పాక్ ఓటమిని తీవ్రంగా పరిగణిస్తున్నట్టు పేర్కొన్నాడు. నికార్సయిన ఓపెనర్లు లేకపోవడం బ్యాటింగ్ పై ప్రభావం చూపిందని అభిప్రాయపడ్డాడు. కీలక మ్యాచ్ లో వ్యూహ చతురత కొరవడిందని తెలిపాడు. జట్టు ప్రయోజనాల దృష్ట్యా యూనిస్ ఖాన్ ను ఓపెనర్ గా పంపడాన్ని సమర్థిస్తానని సక్లయిన్ తెలిపాడు. అయితే, సిసలైన ఓపెనర్, వికెట్ కీపర్ లేని లోటు కొట్టొచ్చినట్టు కనపడిందని అన్నాడు.