: ఒకేసారి 21 మంది తలలు నరికిన ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు... భీతి గొలుపుతున్న వీడియో
ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు మరోసారి తమ క్రూరత్వంతో రెచ్చిపోయారు. ఈజిప్ట్ కు చెందిన 21 మంది కాప్టిక్ క్రిస్టియన్స్ ను లిబియాలోని ట్రిపోలీ సమీపంలో గల సముద్రతీరంలో తలలు తెగ్గోసి చంపారు. ఆ ఘటనను వీడియో తీసి విడుదల చేశారు. తొలిసారి తమ సరిహద్దులు దాటి బయటకు వచ్చి, ఉగ్రవాదులు ఈ దారుణానికి తెగబడడం ఆ ప్రాంతంలో వారి ప్రాబల్యం పెరుగుతోంది అనడానికి సంకేతమని, దీన్ని అడ్డుకోవాలని మానవ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అత్యంత భీతి గొలుపుతున్న ఆ వీడియోను చూసినవారు ఐఎస్ చర్యను తీవ్రంగా ఖండించారు. కాగా, కొన్ని వారాల క్రితం వీరిని ఉగ్రవాదులు లిబియా నుంచి కిడ్నాప్ చేశారు. వీరికి నారింజ రంగు దుస్తులు వేసి, సముద్ర తీరం వెంబడి నడిపించుకుంటూ తీసుకువచ్చి, మోకాళ్ళపై కూర్చోబెట్టారు. ముఖాలకు నల్లటి ముసుగులు ధరించిన ఉగ్రవాదులు పదునైన కత్తులతో గొంతులు కోస్తుండగా, వారి బాధ సముద్రపు అలల హోరులో కలసిపోయింది. ఉగ్రవాదుల లీడర్ గా భావిస్తున్న వ్యక్తి ఒక బందీ తల నరికిన తరువాత తన కత్తిని కెమెరా వైపు విసిరినట్టు అత్యంత నాణ్యతతో విడుదలైన ఈ వీడియోలో ఉంది.