: నాగార్జున సాగర్ వద్ద ఉద్రిక్తత... కుడికాలువకు నీటి విడుదల యత్నాలు, అడ్డుకుంటున్న తెలంగాణ అధికారులు
నాగార్జున సాగర్ కుడి కాలువకు నీరు విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ అధికారులు ప్రయత్నించడంతో నేటి ఉదయం ప్రాజెక్ట్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రెండు రాష్ట్రాలకు చెందిన ఇరిగేషన్ అధికారులు, కిందిస్థాయి ఉద్యోగులు రెండువైపులా మోహరించడంతో, బందోబస్తుగా పోలీసులు భారీగా తరలి వచ్చారు. కుడికాల్వకు 6 వేల క్యూసెక్కుల నీటిని పంట అవసరాల నిమిత్తం విడుదల చేయడానికి ఏపీ అధికారులు నిర్ణయించారు. ఆ యత్నాన్ని అడ్డుకునేందుకు తెలంగాణ నీటి పారుదల శాఖ అధికారులు సిద్ధమయ్యారు. కాగా, నాగార్జున సాగర్ డ్యాం ఉన్నతాధికారులతో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి భేటీ అయ్యారు. మార్చి నెలాఖరు వరకూ సాగర్ కుడి కాలువకు నీరందించాలని, లేకుంటే వేలాది ఎకరాల్లో పంటలకు నష్టం తప్పదని ఆయన తెలిపారు.