: ఠాగూర్ సీన్ రిపీట్... చనిపోయిన వ్యక్తికి వైద్యమంటూ రూ.3 లక్షలు వసూలు చేసిన ఓజోన్ ఆసుపత్రి వైద్యులు!
సుమారు పదేళ్ళ క్రితం వచ్చిన చిరంజీవి సినిమా ఠాగూర్ గుర్తుందా? ఓ వ్యక్తి మరణించాడని తెలిసి కూడా... అతనింకా బతికే ఉన్నాడని, అతనికి వైద్యం చేస్తున్నామని చెప్పి, మృతుడి కుటుంబం నుంచి డాక్టర్లు రూ.3 లక్షలు వసూలు చేసే సంఘటన తెలుసుకదా? సేమ్ అటువంటి సంఘటనే హైదరాబాదు, ఎల్బీనగర్ పరిధిలోని ఓజోన్ ఆసుపత్రిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే, నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన రాజశేఖర్ (35)కు మూడు రోజుల క్రితం గచ్చిబౌలి ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలయ్యాయి. అప్పటి నుంచి ఓజోన్ ఆసుపత్రిలోని అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్నాడు. కుటుంబ సభ్యులను ఐసీయూలోకి అనుమతించకపోవడంతో అతని పరిస్థితి ఎలా ఉందో ఎవరికి తెలియరాలేదు. గురువారం సాయంత్రం డబ్బులు చెల్లించాల్సిందిగా ఆసుపత్రి సిబ్బంది ఒత్తిడి పెంచడంతో కుటుంబసభ్యులు రాజశేఖర్ ను చూపితేనే డబ్బు కడతామని చెప్పారు. ఆసుపత్రి సిబ్బంది తటపటాయించగా, బంధువులకు అనుమానం వచ్చి నిలదీశారు. దీంతో అతడు మృతి చెందాడన్న అసలు విషయం తెలిసింది. చనిపోయిన వ్యక్తికి ట్రీట్మెంటు చేస్తున్నట్టు నటించి రూ.లక్షలు వసూలు చేస్తున్నారని ఆరోపించిన కుటుంబ సభ్యులు, స్థానిక బీజేపీ కార్యకర్తలు ఆసుపత్రి ఎదుట నేటి ఉదయం ధర్నాకు దిగారు. వైద్యుల ధోరణిని నిరసిస్తూ జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కుటుంబ సభ్యులతో ధర్నా విరమింప చేయడానికి యత్నిస్తున్నారు.