: మైసూర్ మహారాజా కుటుంబ వారసుడ్ని ప్రకటించారు


మైసూర్ మహారాజా కుటుంబ వారసుడ్ని అధికారికంగా ప్రకటించారు. మైసూర్ రాజవంశంలోని చివరి తరంలో పురుషులు జన్మించలేదు. దీంతో రాజుగారి సోదరి మనవడ్ని యువరాజుగా ప్రకటించారు. సుమారు 550 ఏళ్ల (1399 నుంచి 1947) పాటు మైసూర్ సంస్థానాన్ని పరిపాలించిన వడయార్ వంశం చివరి రాజు జయ చామరాజేంద్ర వడయార్ కు నరసింహరాజు ఒక్కగానొక్క కుమారుడు. ఐదుగురు కుమార్తెలు ఉన్నారు. నరసింహరాజుకు కుమారులు లేకపోవడంతో ఆయన సోదరి మనవడైన యదువీర్ గోపాలరాజ్ అర్స్ ని వారసుడిగా రాణి, నరసింహరాజు భార్య ప్రమోదాదేవి ప్రకటించారు. నరసింహరాజు వడయార్ 2013లో మృతి చెందారు. దీంతో ఆయన వారసుడిని ఎన్నుకోవడంపై ఎన్నో ఊహాగానాలు రేగాయి. చివరకు నరసింహరాజు వడయార్ సోదరి మనవడు, త్రిపుర సుందరీదేవి, స్వరూప గోపాలరాజ్ అర్స్ కుమారుడు యదువీర్ గోపాలరాజ్ అర్స్ ను యువరాజుగా ప్రకటించారు. 12వ తరగతి వరకు బెంగళూరులో చదువుకున్న యదువీర్, బీఏ చదివేందుకు అమెరికాలోని బూస్టన్ వెళ్లారు. ప్రస్తుతం ఆయన బూస్టన్ లో విద్యనభ్యసిస్తున్నారు. ఆయన దత్తత స్వీకార కార్యక్రమం ఈ నెల 23న మైసూర్ లో జరుగుతుంది. దత్తత అనంతరం ఆయన పేరు యదువీర్ కృష్ణదత్త చామరాజ్ వడయార్ గా మారుతుంది. యువరాజ పట్టాభిషేకం ఎప్పుడు అనేది ఇంకా ప్రకటించలేదు. కాగా, దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించే మైసూర్ మహారాజ కుటుంబం, పట్టాభిషేక మహోత్సవం ఎంత ఆర్భాటంగా నిర్వహిస్తారో అనే ఆసక్తి అందర్లోనూ నెలకొంది.

  • Loading...

More Telugu News