: మా మేనిఫెస్టో అమలుకు రోడ్ మ్యాప్ సిద్ధం చేయండి: ఢిల్లీ సీఎస్ కు కేజ్రీవాల్ ఆదేశం
ఎన్నికల్లో విజయం సిద్ధించిన మరుక్షణమే ప్రజలకిచ్చిన హామీల అమలుపై ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ దృష్టి సారించారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టనున్న కేజ్రీవాల్ ను నిన్న ఢిల్లీ చీఫ్ సెక్రెటరీ డీఎం స్పోలియా మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా 70 హామీలతో కూడిన ఆప్ మేనిఫెస్టోను కేజ్రీవాల్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అందజేశారు. మేనిఫెస్టోలోని హామీలను అమలు చేసేందుకు అవసరమైన రోడ్ మ్యాప్ (కార్యాచరణ ప్రణాళిక)ను సిద్ధం చేయాలని సీఎస్ కు కేజ్రీవాల్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 19 లోగానే సదరు రోడ్ మ్యాప్ కాపీ తమకు అందజేయాలని కూడా కేజ్రీవాల్ డెడ్ లైన్ పెట్టారు. 50 శాతం మేర విద్యుత్ చార్జీల తగ్గింపు, నగరంలో ఉచిత వై-ఫై, నగరంలో 10-15 లక్షల సీసీ కెమెరాల ఏర్పాటు తదితర ముఖ్యమైన హామీలను ఆప్ తన మేనిఫెస్టోలో పేర్కొంది.