: ధోనీ హెల్మెట్ స్థానంలో... కేజ్రీవాల్ ‘క్రేజీ మఫ్లర్’: సోషల్ మీడియాలో ఫొటో హల్ చల్
ఢిల్లీ ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించిన ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ నిన్నటిదాకా ఉన్న రికార్డులన్నింటినీ చెరిపేశారు. సామాన్యుడిగా బరిలోకి దిగిన ఆయన కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని దేశ రాజధాని ఢిల్లీలోనే మట్టికరిపించిన తీరు అత్యద్భుతం. కేజ్రీవాల్ ఆహార్యంలో ప్రత్యేకంగా నిలుస్తున్న మఫ్లర్, ఆయన విజయానికి కారణమని కొందరు క్రీడాభిమానులు కొత్త భాష్యం చెబుతున్నారు. రెండు రోజుల్లో మొదలుకానున్న వన్డే వరల్డ్ కప్ లో టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కూడా రికార్డులను తిరగరాయాలని భారత క్రికెట్ అభిమానులు ఆశిస్తున్నారు. కేజ్రీవాల్ మాదిరిగా ధోనీ కూడా మఫ్లర్ కట్టుకుంటే, వరల్డ్ కప్ టీమిండియాదేనంటూ ప్రచారం చేస్తున్నారు. ఇందులో భాగంగా హెల్మెట్ స్థానంలో మఫ్లర్ ను చుట్టుకుని బ్యాటింగ్ చేస్తున్నట్టుగా ధోనీ ఫొటోను మార్ఫింగ్ చేశారు. కేజ్రీవాల్ లాగా ధోనీ కూడా మఫ్లర్ చుట్టుకుంటే వరల్డ్ కప్ మనదేనంటూ దానికి వ్యాఖ్యలూ జోడించి సోషల్ మీడియాలో పెట్టేశారు. ప్రస్తుతం ఈ పోస్టింగ్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.