: మా పొలాలు తీసుకుంటే పురుగుమందు తాగుతాం: రాజధాని రైతుల పోరుబాట!
తమ గ్రామాన్ని రాజధాని పరిధి నుంచి మినహాయించాలని, లేకుంటే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని సీఆర్‌డీఏ అసిస్టెంట్ కమిషనర్ గంధం చంద్రుడును రైతులు ఘొరావ్ చేశారు. ఈ ఘటన నిన్న రాత్రి మంగళగిరి మండలం కురగల్లు గ్రామంలో జరిగింది. భూసమీకరణను పరిశీలించేందుకు వచ్చిన చంద్రుడును గ్రామస్తులు చుట్టుముట్టి నిరసన తెలిపారు. రైతులు, మహిళలు, పిల్లలతో గ్రామస్తులు పంచాయతీ కార్యాలయానికి పురుగుమందు డబ్బాలు తీసుకువచ్చి అధికారులపై విరుచుకుపడ్డారు. ‘మాకు రాజధాని వద్దు.. మా గ్రామాన్ని రాజధాని నిర్మాణంలో తొలగించాలి’ అని వారు డిమాండ్ చేశారు. లేకపోతే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. చివరకు అధికారులు వారికి నచ్చజెప్పి అక్కడి నుంచి బయటపడ్డారు.