: ‘స్టార్’లో భాగం కానున్న 'మా' టీవీ... తెలుగు వినోద రంగంలో కుదిరిన కీలక ఒప్పందం
తెలుగు వినోద రంగంలో కొద్దిసేపటి క్రితం కీలక ఒప్పందం కుదిరింది. తెలుగు టీవీ ప్రేక్షకుల ఆదరాభిమానాలను చూరగొన్న 'మా' టీవీ ఇకపై స్టార్ టీవీ యాజమాన్యం కింద కార్యకలాపాలు సాగించనుంది. ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ తో పాటు టాలీవుడ్ ప్రముఖ నటులు చిరంజీవి, నాగార్జున, నిర్మాత అల్లు అరవింద్ లకు మెజారిటీ వాటాలున్న మా టీవీలో, ప్రపంచ మీడియా మొఘల్ రూపర్ట్ మర్డోక్ నేతృత్వంలోని స్టార్ టీవీ భాగస్వామి అయింది. ఈ మేరకు ఇరు సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది. అయితే స్టార్ టీవీ యాజమాన్యం ఎంత వాటా కొనుగోలు చేసిందన్న విషయాన్ని మాత్రం మా టీవీ చైర్మన్ నిమ్మగడ్డ ప్రసాద్ వెల్లడించలేదు. వాటాల విషయంపై తర్వాత చెబుతామని ఆయన పేర్కొన్నారు. అనంతరం స్టార్ నెట్ వర్క్ ప్రతినిధి మాట్లడుతూ, మా టీవీని మరింత ముందుకు తీసుకెళ్లే కార్యాచరణలో ప్రస్తుత కంపెనీ ప్రమోటర్లు ఉన్నారని తెలిపారు. తాము కేవలం బ్రాడ్ కాస్టింగ్ బిజినెస్ వరకే పరిమితమవుతామని... సంస్థ మాత్రం ప్రస్తుత ప్రమోటర్ల ఆధ్వర్యంలోనే నడుస్తుందని తెలిపారు. ఈ మేరకు మాటీవీ యాజమాన్యంతో తాము ఓ ఒప్పందానికి వచ్చామని వెల్లడించారు.