: సివానీ గ్రామం నుంచి సీఎం పీఠం దాకా...
డబ్బు, మద్యం పంచకుండా ఓ పార్టీ విజయం సాధించడం మన దేశంలో దాదాపు అసాధ్యమని ఇప్పటిదాకా భావిస్తూ వచ్చారు. కానీ, ఆమ్ ఆద్మీ పార్టీ అలాంటి అభిప్రాయాలను కొట్టిపారేస్తూ, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బ్రహ్మాండమైన విజయం నమోదు చేసింది. మొత్తం 70 స్థానాలకు గాను 67 స్థానాల్లో విజయదుందుభి మోగించింది. ఆప్ ప్రభంజనంలో కొట్టుకుపోయిన బీజేపీ 3 స్థానాల్లో నెగ్గగా, కాంగ్రెస్ కు మిగిలింది శూన్యమే. ఆ పార్టీ ఒక్క స్థానాన్నీ గెలవలేక చతికిలపడిపోయింది. ఈ రెండు పార్టీల భంగపాటుకు కారణం ఓ సామాన్యుడు. అతని పేరు అరవింద్ కేజ్రీవాల్ అని ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. నిజాయతీకి పట్టుదల తోడైతే ఎలాంటి ఫలితాలు వస్తాయన్నదానికి ఆయన నిలువెత్తు నిదర్శనం. హర్యానాలోని సివానీ గ్రామంలో 1968 ఆగస్టు 16న జన్మించారు కేజ్రీవాల్. తండ్రి పేరు గోవింద్ రామ్ కేజ్రీవాల్, తల్లి పేరు గీతాదేవి. గోవింద్ రామ్ 'బిర్లా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ'లో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చేశారు. ఇక, కేజ్రీవాల్ విద్యాభ్యాసం పలుచోట్ల సాగింది. హిస్సార్, సోనేపట్ ప్రాంతాల్లో జరిగింది. ఖరగ్ పూర్ ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మెకానికల్ ఇంజినీరింగ్ పట్టా పుచ్చుకున్న తర్వాత ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ కు ఎంపికయ్యారు. ఇన్ కమ్ టాక్స్ విభాగంలో జాయింట్ కమిషనర్ గా పనిచేశారు. 1994లో ఆయన వివాహం సునీతతో జరిగింది. కేజ్రీవాల్ దంపతులకు ఇద్దరు పిల్లలు. వారి పేర్లు హర్షిత, పులకిత్. సామాజిక స్పృహ మెండుగా ఉన్న కేజ్రీ అన్నాహజారేతో కలిసి అవినీతి వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నారు. 2006లో ఆయనకు అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్ఠాత్మకమైన రామన్ మెగసెసె అవార్డు లభించింది. అటుపై ఉద్యమాలు కొనసాగిస్తూనే ఆమ్ ఆద్మీ పార్టీ స్థాపించారు. 2013లో ఢిల్లీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఆమ్ ఆద్మీకి 28 స్థానాలు రాగా, 8 స్థానాలు నెగ్గిన కాంగ్రెస్ పార్టీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. జన్ లోక్ పాల్ బిల్లు ఆమోదం పొందకపోవడంతో కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేశారు. దీంతో, ఆప్ పాలన 49 రోజులకే ముగిసింది. తదనంతర పరిణామాల నేపథ్యంలో ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధించారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో ఏం జరిగిందన్నది విదితమే. చీపురు కట్ట గుర్తుతో ఎన్నికల్లో పాల్గొని జాతీయ పార్టీలను ఊడ్చిపారేసిన 'సామాన్యుడు' కేజ్రీవాల్ ఈ నెల 14న ఢిల్లీ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.