: కరకట్టపై అనుమతులతోనే నిర్మాణాలు చేపట్టాము: గోకరాజు గంగరాజు
కృష్ణానది కరకట్టల ఆక్రమణలపై ఎంపీ గోకరాజు గంగరాజు వివరణ ఇచ్చారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, కరకట్టపై అన్ని అనుమతులతోనే భవనాలు నిర్మించామని అన్నారు. బీజేపీ ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యాలయ నిర్మాణానికి ఎలాంటి ఆటంకాలు లేవని ఆయన స్పష్టం చేశారు. రాజధాని భూసేకరణ కోసం భూములు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు. కాగా, కృష్ణానది కరకట్టపై అత్యంత విలాసవంతమైన భూములను లీజు పేరిట గంగరాజు ఆక్రమించారని వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. దీంతో బీజేపీపై విమర్శలు చెలరేగాయి. ఇటీవల వామపక్ష నేతలు కరకట్టపై దురాక్రమణలను సందర్శించిన సంగతి కూడా తెలిసిందే.