: ఘోర రోడ్డు ప్రమాదం... పెళ్లి బృందంలోని ఐదుగురి దుర్మరణం
మరికాసేపట్లో రిసెప్షన్... తెల్లవారితే కోరుకున్న వాడితో పెళ్లి అనుకొంటూ, ఊహల్లో తేలియాడుతూ ఉన్న నవ వధువు తీవ్ర విషాదంలో మునిగింది. వివాహం కోసం 20 మంది బంధుమిత్రులతో కలసి వెళుతున్న బోలెరో టెంపో వాహనం బోల్తా పడగా, వధువు తండ్రి, పెద్దమ్మ సహా ఐదుగురు దుర్మరణం చెందారు. కర్నాటకలోని హుణసెకట్టె సమీపంలో జరిగిన ఈ ఘటనలో మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం రాత్రి బళ్లారిలో రిసెప్షన్, సోమవారం వివాహం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకున్న పెళ్లి పెద్దలు వధువుతో కలసి వెళుతుండగా అదుపుతప్పిన వాహనం బోల్తా కొట్టింది. గాయపడిన వారిలో పెనుకొండకు చెందిన అనంతలక్ష్మి, మంగళమ్మ ఉన్నారు. తీవ్రంగా గాయపడ్డ వధువు మేరీ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.