: ఏపీని బీజేపీ మోసం చేసింది: సీతారామ్ ఏచూరి
ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడం వల్లే బీజేపీ లాభాలు పొందిందని సీపీఎం సీనియర్ నేత సీతారామ్ ఏచూరి పేర్కొన్నారు. విజయవాడలో సీపీఎం 24వ రాష్ట్ర మహాసభలు ప్రారంభమైన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, టీడీపీ వల్ల లబ్ధి పొందినప్పటికీ బీజేపీ ఆంధ్రప్రదేశ్ కు ఇస్తామన్న ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వలేదని అన్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత బీజేపీ ఏపీని మోసం చేసిందని ఆయన పేర్కొన్నారు. పోనీ భవిష్యత్తులోనైనా ఇస్తుందా అంటే, అలాంటి నమ్మకం లేదని ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ను సింగపూర్ గా మారుస్తానని సీఎం చంద్రబాబునాయుడు ప్రజలను మభ్యపెడుతున్నారని ఆయన మండిపడ్డారు. సీఎం ప్రతి సభలోనూ డబ్బులు లేవని, జీతాలు కూడా చెల్లించలేకపోతున్నామని, కాంట్రాక్టర్లకు నిధులు చెల్లించవద్దని ఆదేశాలు జారీ చేస్తూ సింగపూర్ గా ఎలా చేస్తారని ఆయన నిలదీశారు. సింగపూర్ లా అభివృద్ధి చేస్తే మంచిదే కానీ, నిజంగా అలాంటి అభివృద్ధి జరుగుతుందా? అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.