: నీతి ఆయోగ్ తొలి భేటీ ప్రారంభం... హాజరైన సీఎంలు, లెఫ్ట్ నెంట్ గవర్నర్లు
ప్రణాళిక సంఘం స్థానంలో కొత్తగా రూపుదిద్దుకున్న నీతి ఆయోగ్ తొలి భేటీ కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. ఢిల్లీలోని ప్రధాని నరేంద్ర మోదీ అధికారిక నివాసంలో జరుగుతున్న ఈ భేటీకి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్ట్ నెంట్ గవర్నర్లు హాజరయ్యారు. ప్రధాని అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి నీతి ఆయోగ్ పాలకవర్గం సభ్యులు కూడా హాజరయ్యారు. ఇప్పటికే పాలకవర్గంతో ఓసారి భేటీ నిర్వహించిన ప్రధాని మోదీ, నీతి ఆయోగ్ విధివిధానాలపై సమాలోచనలు చేశారు. నేటి భేటీకి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబునాయుడు, కేసీఆర్ లు కూడా హాజరయ్యారు.