: ఢిల్లీ బయలుదేరిన ఏపీ సీఎం చంద్రబాబు... నీతి ఆయోగ్ భేటీకి తెలుగు రాష్ట్రాల సీఎంలు
ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు కొద్దిసేపటి క్రితం ఢిల్లీ బయలుదేరారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నేడు తొలిసారి భేటీ కానున్న నీతి ఆయోగ్ సమావేశానికి చంద్రబాబుతో పాటు ఇప్పటికే ఢిల్లీలో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా హాజరుకానున్నారు. మొన్న ఆర్థిక రంగ నిపుణులతో భేటీ నిర్వహించిన మోదీ, నేడు నీతి ఆయోగ్ పూర్తి స్థాయి కార్యవర్గంతో భేటీ కానున్నారు. ఈ సమావేశానికి తెలుగు రాష్ట్రాల సీఎంలతో పాటు మిగిలిన అన్ని రాష్ట్రాల సీఎంలు, సంస్థలో నియమితులైన ఆర్థిక రంగ నిపుణులు హాజరుకానున్నారు. నీతి ఆయోగ్ సమావేశం అనంతరం చంద్రబాబు, ప్రధాని నరేంద్ర మోదీతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఆ తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతోనూ చంద్రబాబు సమావేశమవుతారు. నేటి సాయంత్రం ఢిల్లీ పర్యటనను ముగించుకుని ఆయన తిరిగి హైదరాబాదు బయలుదేరతారు.