: పోలియోపై పోరాడేందుకు పొరుగు దేశాలకు భారత్ స్నేహ హస్తం
పేద దేశాలతో పాటు అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనూ పోలియో ప్రభావం తెలిసిందే. భారత్ గత కొన్నేళ్లుగా పోలియో నిర్మూలనకు ఎడతెరిపిలేని పోరాటం సాగిస్తోంది. ఈ క్రమంలో సత్ఫలితాలనే సాధించిందనుకోవాలి. దేశంలో పోలియో దాదాపుగా కనుమరుగైనట్టేనని నివేదికలు చెబుతున్నాయి. తాజాగా, పోలియోను తరిమికొట్టేందుకు పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్ దేశాలతో సంయుక్తంగా సమరం సాగించాలని భారత్ నిర్ణయించింది. అందుకోసం ఆ రెండు దేశాలకు సాయం అందిస్తామని పేర్కొంది. ఇటీవలే భారత్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పాక్, ఆఫ్ఘన్ నుంచి బృందాలను ఆహ్వానించింది. ఇక్కడ పోలియో నిర్మూలనకు తాము అనుసరిస్తున్న విధానాలను పరిశీలించాల్సిందిగా సూచించింది. ఆఫ్ఘన్ బృందం ఫిబ్రవరి 21న రానుంది. పాకిస్థాన్ ఇంకా తన స్పందన తెలియపరచలేదు. పాక్, ఆఫ్ఘన్ దేశాల్లో పోలియో పీడితులు అధిక సంఖ్యలో ఉన్నారని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్ఓ) నివేదికలు చెబుతున్నాయి. 2014లో డబ్ల్యూహెచ్ఓ విడుదల చేసిన వార్షిక నివేదికలో ప్రపంచంలో పోలియో ప్రభావిత దేశాలుగా ఆఫ్ఘనిస్తాన్, నైజీరియా, పాకిస్థాన్ లను పేర్కొన్నారు.