: ఫోర్జరీ కాగితాలతో బెయిలు కోసం ఒప్పందం!... సహారా చీఫ్ సుబ్రతా రాయ్ మెడకు మరో ఉచ్చు!


సుమారు రూ.10 వేల కోట్లు డిపాజిట్ చేస్తేగాని తీహార్ జైలు నుంచి బయటకు రాలేని పరిస్థితిలో ఉన్న సహారా గ్రూప్ సంస్థల అధినేత సుబ్రతా రాయ్ మెడకు మరో ఉచ్చు చిక్కుకోనుందా? అంటే, అవుననే అంటున్నారు న్యాయ నిపుణులు. ఆయనకు బెయిలు తెప్పించేందుకు ఫోర్జరీ పత్రాలను వాడినట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో సుబ్రతా రాయ్ ప్రమేయంపై ఆధారాలు లేనప్పటికీ, ఇదే నిజమైతే ఆయన మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వుంటుంది. కాగా, కోర్టుకు డిపాజిట్ చేయాల్సిన డబ్బు కోసం న్యూయార్క్ లోని ప్లాజా హోటల్ సహా కొన్ని అతిథి గృహాలను సుబ్రతా రాయ్ అమ్మకానికి ఉంచారు. వీటిని కొనేందుకు పెట్టుబడిదారులు సిద్ధంగా ఉన్నారని శారాన్ష్ శర్మ అనే పేరున్న మాజీ బ్రోకర్ సుబ్రతా రాయ్ ని సంప్రదించాడు. పలుమార్లు తీహార్ జైలులో ఆయనను కలిశాడు కూడా. ఆ తరువాత బ్యాంకు ఆఫ్ అమెరికాలోని ఖాతాలో ఆయన బిలియన్ డాలర్లకు పైగా నగదు జమ చేశాడని సహారా కార్పొరేట్ ఫైనాన్సు విభాగం హెడ్ సందీప్ వాద్వా తెలిపారు. ఇక, నేడో రేపో రాయ్ కి జైలు గోడల నుంచి విముక్తి కలుగుతుందని అంతా భావించారు. ఈలోగా తమ బ్యాంక్ లో అటువంటి ఖాతా ఏమీ లేదని బ్యాంకు అఫ్ అమెరికా అధికారులు స్పష్టం చేయడంతో మొత్తం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. శర్మపై అమెరికాలో రెండు కేసులు విచారణలో ఉన్నాయన్న వార్త కూడా గుప్పుమంది. దీంతో, ఆయన బెయిలు వ్యవహారంపై మొత్తం నివేదికను ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇది సుబ్రతారాయ్ కి నిజంగా తలనొప్పి కలిగించే అంశమే!

  • Loading...

More Telugu News