: బంజారాహిల్స్ లో ముగ్గురు చిన్నారుల అదృశ్యం... బెజవాడలో ప్రత్యక్ష్యం!
హైదరాబాదులోని బంజారాహిల్స్ లో అదృశ్యమైన ముగ్గురు చిన్నారులు విజయవాడలో తేలారు. చిన్నారుల అదృశ్యంపై ఫిర్యాదునందుకున్న పోలీసులు రంగంలోకి దిగిన కొద్దిగంటల్లోనే పిల్లల ఆచూకీ లభించింది. దీంతో, అటు పిల్లల తల్లిదండ్రులతో పాటు, ఇటు పోలీసులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. బంజారాహిల్స్ లోని ఎంబీటీ నగర్ కు చెందిన శ్రవణ్ (11), పవన్ (14), దుర్గా ప్రసాద్ (15)లు నిన్న సాయంత్రం అదృశ్యమయ్యారు. దీనిపై ఫిర్యాదునందుకున్న పోలీసులు మిగిలిన పోలీస్ స్టేషన్ల సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఈ నేపథ్యంలో అనుమానాస్పదంగా తచ్చాడుతున్న చిన్నారులను బెజవాడ పోలీసులు అదుపులోకి తీసుకుని నగరంలోని భవానీ నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆ తర్వాత బంజారాహిల్స్ పోలీసులకు సమాచారం అందించారు. బెజవాడలో పోలీసులకు దొరికిన పిల్లలు ఎంబీటీ నగర్ చిన్నారులేనని నిర్ధారించుకున్న బంజారాహిల్స్ పోలీసులు వారిని నగరానికి తీసుకువచ్చేందుకు చర్యలు ప్రారంభించారు.