: తమిళనాడులోని స్కూళ్లు, కళాశాలల్లో అందాల పోటీలు రద్దు
తమిళనాడులో అందాల పోటీలపై మద్రాస్ హైకోర్టు సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. పాఠశాలలు, కళాశాలల్లో జరిగే అందాల పోటీలను రద్దు చేసింది. ఈ మేరకు విద్యా సంస్థలన్నింటికీ ఉత్తర్వులు జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. చెన్నైలో గిండిలో ఉన్న అన్నా యూనివర్శిటీలో ఉన్న ఇంజినీరింగ్ కళాశాల 2013లో 'మిస్ టెక్ని ఫెస్ట్' పేరుతో బ్యూటీ కాంటెస్టు నిర్వహించింది. అందులో గెలుపొందిన ఓ ఇంజినీరింగ్ విద్యార్థినికి నగదు బహుహతి కింద ఇస్తామన్న రూ.25 లక్షలు ఇవ్వలేదు. ఈ క్రమంలో నగదు బహుమతితో పాటు మరో రూ.5 లక్షలు అదనంగా ఇప్పించాలంటూ విద్యార్థిని తల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. విజేతైన తమ కుమార్తెకు నిర్వాహకులు నకిలీ సర్టిఫికెట్ ఇచ్చారని మూడు నెలల తరువాత ఆరోపించారు. ఈలోగా కోర్టు సదరు కళాశాలవారిని కౌంటర్ దాఖలు చేయమని ఆదేశించినా చేయలేదు. చివరికి ఆ పిటిషన్ పై విచారణ చేపట్టిన జస్టిస్ టీఎస్ శివజ్ఞానమ్, మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ర్యాంప్ పై విద్యార్థిని వాక్ చేస్తే, అది ఆమె చదువుతున్న ఇంజినీరింగ్ కోర్సుకు ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలియడం లేదని వ్యాఖ్యానించింది.