: ప్రజలపై 'బాదుడు'లో ఏపీ, టీఎస్ పోటాపోటీ!


ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తరువాత పలురకాల ఇబ్బందులు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు అవగతం అవుతున్నాయి. ఖజానాకు నిధులను చేర్చడమే లక్ష్యంగా, కేంద్రం నుంచి రుణాలను పొందడంలో విఫలమైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు తమ ప్రతాపాన్ని ప్రజలపై చూపడం మొదలుపెట్టాయి. కేంద్రం కనికరిస్తున్నా ఆ మేరకు వెసులుబాటు ప్రజలకు లభించడంలేదు. గడచిన నెల రోజుల వ్యవధిలో పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు ఆరు రూపాయలకు పైగా తగ్గగా, తెలుగు ప్రజలకు తగ్గింది మాత్రం పైసల్లోనే. కారణం పెట్రో ఉత్పత్తులపై విలువ ఆధారిత పన్నును ఏపీ, టీఎస్ సర్కారులు పెంచేశాయి. ఇదొక్కటే కాదు, ప్రభుత్వం వద్ద ఒక్క పైసా కూడా లేదని, ఉద్యోగులకు వేతనాల చెల్లింపు కష్టంగా వుందని బహిరంగంగానే చెబుతున్న చంద్రబాబు, కరెంటు బిల్లులపై అధికంగా రాబట్టాలని భావిస్తున్నారు. ఇప్పటికే, ఏపీలో విద్యుత్ చార్జీల పెంపుపై డిస్కంలు ప్రతిపాదనలు పంపాయి. సామాన్యుడి ప్రధాన రవాణా సాధనంగా ఉన్న బస్సు చార్జీలను పెంచాలని కూడా నిర్ణయించినట్టు తెలుస్తోంది. నష్టాల్లో నడుస్తున్న ఆర్టీసీ విభజన ఇంకా పూర్తి కాకపోవడంతో, టికెట్ ధరలను పెంచితే ఆ భారం తెలుగు ప్రజలందరిపైనా పడనుంది. గత రెండేళ్లుగా ఆన్ లైన్ మాధ్యమంలో ఇ-కామర్స్ వెబ్ సైట్ల నుంచి ఎలక్ట్రానిక్ వస్తువులను కొనుగోలు చేస్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరగడం, ఈ లావాదేవీలపై ప్రభుత్వాలకు పన్నుల రూపంలో దక్కాల్సిన ఆదాయానికి కొర్రి పడడంతో, ఈ దిశగా కేరళ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాన్ని పరిశీలించాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఆన్ లైన్ లావాదేవీలపై పన్నులు విధిస్తే కొంతమేరకు ఆదాయం పెరుగుతుందని భావిస్తున్నారు. స్థలాల రిజిస్ట్రేషన్ చార్జీలు ఇప్పటికే పెరగగా, నీటి బిల్లులు, ప్రజలపై విధించే జరిమానాలు పెంచాలని, మద్యంపై పన్నులు పెంచి తాగుబోతుల నుంచి మరింతగా పిండుకోవాలని కూడా ప్రభుత్వాలు ప్లాన్ చేస్తున్నాయి.

  • Loading...

More Telugu News