: కుదువపెట్టిన బంగారం మాయం... వనస్థలిపురంలో ఐఐఎఫ్ఎల్ ముందు బాధితుల ఆందోళన
కుటుంబ అవసరాల కోసం కుదువపెట్టిన బంగారం మాయమైందని తెలుసుకున్న హైదరాబాదు, వనస్థలిపురం వాసులు ఆందోళనకు దిగారు. కొద్దిసేపటి క్రితం వెలుగు చూసిన ఈ ఘటనలో మొత్తం 217 మంది బంగారాన్ని కుదువపెట్టగా, వారిలో 28 మందికి చెందిన బంగారం మినహా మిగిలిన వారి బంగారమంతా మాయమైపోయిందట. దాని విలువ రూ.25 లక్షలుంటుందని తెలుస్తోంది. వివరాల్లోకెళితే... వనస్థలిపురంలోని ఐఐఎఫ్ఎల్ లో సమీప ప్రాంత వాసులు 217 మంది బంగారాన్ని కుదువపెట్టి డబ్బు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో, బంగారం మాయమైందన్న విషయం తెలుసుకుని వారు శాఖ ముందు ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు విచారణ మొదలుపెట్టారు. పోలీసుల విచారణలో ఆసక్తికర అంశం వెలుగు చూసింది. ఆర్థిక లావాదేవీలు నిర్వహించే కార్యాలయాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు తప్పనిసరి. అయితే, ఐఐఎఫ్ఎల్ వనస్థలిపురం శాఖలో సీసీ కెమెరాలు లేవట. దీనిని అవకాశంగా తీసుకున్న బ్యాంకు సిబ్బందే బంగారాన్ని కాజేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే, సిబ్బందిలో ఎవరు ఈ చోరీకి పాల్పడి ఉంటారన్న విషయం కనుగొనేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించక తప్పేలా లేదు.