: 'స్మార్ట్ ఫోన్' కిరీటాన్ని మైక్రోమాక్స్ కు అప్పగించిన శామ్ సంగ్!
భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్లో అత్యధిక విక్రయాలు నమోదు చేసిన సంస్థగా మైక్రోమాక్స్ నిలిచింది. డిసెంబర్ 31తో ముగిసిన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికంలో సౌత్ కొరియా దిగ్గజం శామ్ సంగ్ కన్నా అధిక సెల్ ఫోన్ యూనిట్లను విక్రయించి, 'స్మార్ట్ ఫోన్' అమ్మకాల్లో సరికొత్త రారాజుగా మారింది. రీసెర్చ్ సంస్థ కానలిస్ వెల్లడించిన వివరాల ప్రకారం అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య కాలంలో మొత్తం 2.16 కోట్ల స్మార్ట్ ఫోన్లు ఇండియాలో అమ్ముడు కాగా, వీటిల్లో మైక్రోమాక్స్ 22 శాతం, శామ్ సంగ్ 20 శాతం వాటాను సొంతం చేసుకున్నాయి. చైనా తరువాత రెండవ అతిపెద్ద మొబైల్ ఫోన్ మార్కెట్ గా భారత్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కాగా, శామ్ సంగ్ తో పోలిస్తే మైక్రోమాక్స్ తక్కువ ధరకు అధిక ఫీచర్లు వున్న స్మార్ట్ ఫోన్ లను అందిస్తోంది. మైక్రోమాక్స్ విక్రయించిన మొత్తం ఫోన్లలో 59 శాతం రూ.6 వేల కన్నా తక్కువ ధరలో వుండటం గమనార్హం. ఈ రెండు కంపెనీల తరువాత ఇండియాలో అత్యధికంగా స్మార్ట్ ఫోన్లను విక్రయిస్తున్న సంస్థలలో కార్బన్, లావాలు నిలిచాయి.