: మరింత దిగువకు చమురు ధరలు... వరుసగా పదోసారి తగ్గిన పెట్రోల్ ధర


అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరల పతనంతో పెట్రోల్ ధర మరోమారు తగ్గింది. పెట్రోల్ ధరతో పాటు డీజిల్ ధరను కూడా తగ్గిస్తూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. తాజా తగ్గుదలలో పెట్రోల్ ధర లీటరుకు రూ. 2.42, డీజిల్ ధర రూ. 2.25 తగ్గింది. ఆయిల్ కంపెనీలు తీసుకున్న ధరల తగ్గింపు నిర్ణయం నిన్న రాత్రి నుంచి అమలులోకి వచ్చింది. స్థానిక పన్నుల్లో తగ్గింపునూ కలుపుకుంటే ధరలు మరికొంత తగ్గుతాయి. హైదరాబాద్‌లో పెట్రోల్ ధర రూ.66.39 నుంచి రూ.63.92కు, డీజిల్ ధర రూ. 54.57 నుంచి రూ.52.13కు తగ్గింది. పెట్రోల్ ధర ఆగస్టు నుంచి వరుసగా తగ్గడం ఇది పదోసారి కాగా, డీజిల్ ధర అక్టోబర్ నుంచి వరుసగా తగ్గడం ఇది ఆరోసారి. చమురు ధరలు తాజాగా తగ్గినా చమురు కంపెనీలకు ఇప్పటికీ లీటరు పెట్రోల్‌పై రూ. 4, లీటరు డీజిల్‌పై రూ. 3.6 లాభం వస్తోంది. ముడి చమురు కొనుగోలుకు, శుద్ధి చేసిన చమురు అమ్మకానికి మధ్య కాలంలో అంతర్జాతీయ విపణిలో ధరల తగ్గుదల వల్ల కంపెనీలకు వచ్చిన నిల్వల నష్టాన్ని పూడ్చుకోవడానికి ఈ లాభాలను వాడుకుంటున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. పెట్రోల్ ధర మళ్లీ తగ్గినప్పటికీ అది విమాన ఇంధనం(ఏటీఎఫ్) కంటే ఎక్కువగా ఉండడం గమనార్హం. ఢిల్లీలో ప్రస్తుతం లీటరు ఏటీఎఫ్ రూ. 46.51 పలుకుతోంది.

  • Loading...

More Telugu News