: అమ్మాయిలను నేల మీదే కాదు, ఆకాశంలో కూడా వదలని కీచకులు!
కీచకులు మహిళలను నేల మీదే కాదు, ఆకాశంలో కూడా వదలడం లేదు. ఇండిగో విమానంలో వయసు మీరిన ఈవ్ టీజర్ ఆగడాలకు వీడియోతో బుద్ధి చెప్పిందో యువతి. జార్ఖండ్ కు చెందిన ఓ యువతి ఇండిగో విమానంలో భువనేశ్వర్ ప్రయాణిస్తుండగా, ఆమె వెనుక సీటులో వయసు మీరిన ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు. సీట్ల మధ్యలో ఉన్న గ్యాప్ నుంచి ఆమెను తాకేందుకు ప్రయత్నించాడు. అతని ప్రయత్నాన్ని పసిగట్టిన యువతి అతని ఆకతాయి చర్యలను అడ్డుకునేందుకు ఎంతగా ప్రయత్నించినా అతను ఆగడం లేదు. దీంతో విసిగిపోయిన ఆమె ధైర్యం కూడదీసుకుని అతని ఫొటోతో పాటు అక్కడ జరుగుతున్న సంఘటనను కొద్దిసేపు వీడియో తీసింది. తరువాత ఒక్కసారిగా కేకలు వేసింది. ఆమె అరుపులు విన్న విమాన సిబ్బంది, తోటి ప్రయాణికులు ఆ యువతికి అండగా నిలిచారు. దీంతో, జరిగిన సంఘటనపై సహ ప్రయాణికులతో కలిసి ఆమె ఎయిర్ పోర్టు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, విమానంలో ఈవ్ టీజర్ భువనేశ్వర్ లోని పలు కంపెనీలకు ఛైర్మన్ అని తెలుస్తోంది. అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, కొంత సేపటి తరువాత వదిలేయడం గమనార్హం.