: తొలిసారి కామెంటరీపై ఎగ్జైట్ అవుతున్న అమితాబ్
ఇంతకాలం సినీ నటుడిగా కొనసాగిన బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ ఇప్పుడు క్రికెటర్ కామెంటేటర్ అవతారం ఎత్తబోతున్న విషయం విదితమే. ఈ ఏడాది ప్రపంచకప్ లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ సందర్భంగా 'బిగ్ బి' వ్యాఖ్యానం వినిపించనున్నాడు. ఈ నేపథ్యంలో క్రికెట్ పరిభాష, కామెంటరీ మెళకువలు నేర్చుకునే పనిలో అమితాబ్ బిజీగా ఉన్నాడట. "లైవ్ కామెంటరీపై చాలా ఉత్సాహంగా ఉన్నా. కపిల్ దేవ్, హర్షా బోగ్లేలతో నేను జాయిన్ అవుతున్నా. కామెంటరీకి సంబంధించి వారి నుంచి టిప్స్ తీసుకుంటున్నా. 'మిడాఫ్, మిడాన్' గురించి తెలుసుకుంటున్నా" అని మీడియాకు తెలిపారు. వరల్డ్ కప్ పోటీలు ఈ నెల 14న ప్రారంభమవుతాయి. 15న భారత్-పాకిస్థాన్ మ్యాచ్ జరగనుంది. ఈ నెల 6న 'షమితాబ్' విడుదలకానుంది. ఈ క్రమంలో తమ సినిమాను ప్రమోట్ చేసుకోవాలన్న ఉద్దేశంతో దర్శకుడు బాల్కీ ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ఇందుకు క్రీడా ప్రసారకులు, నిర్మాతల మధ్య కుదిరిన సమన్వయంతో ప్రచారంలో భాగంగా తాను ఇలా (కామెంటరీ) చేస్తున్నట్టు వెల్లడించారు.