: కేసీఆర్ వాహనాలపై గుడి నీడ పడుతోందట... అందుకే కొత్త రోడ్డు వేస్తున్నారట
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు వాస్తు సెంటిమెంట్లు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇద్దరూ కలసి వాస్తు మార్పుల కోసం ఇప్పటికే రూ. 170 కోట్లు తగలేశారని మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. వాస్తు విషయంలో టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ కు పట్టింపులు మరీ ఎక్కువ. ఎంత ఎక్కువంటే, అవసరమైతే చంద్రబాబుకు కూడా వాస్తు సలహాలు ఇచ్చేంత! ఇప్పటికే రకరకాల వాస్తు సంబంధిత వార్తలతో హెడ్ లైన్లలో నిలిచిన కేసీఆర్... ఇప్పుడు మరో వాస్తు పరమైన నిర్ణయం తీసుకున్నారు. సచివాలయంలో సీఎం కార్యాలయం ఉండే సమత బ్లాక్ కు వెళ్లడానికి వన్ వే ఉంది. ఇప్పుడు దాన్ని రెండు రోడ్లుగా చేసి, మధ్యలో డివైడర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనికోసం రూ. 10 లక్షలు ఖర్చు చేస్తున్నారు. దీనికి కారణం ఏమిటంటే, సీఎం ప్రయాణించే వాహనాలపై పక్కనే ఉన్న పోచమ్మ గుడి నీడ పడుతోందట. గుడి నీడ పడటం మంచిది కాదని భావించిన కేసీఆర్ ఈ మేరకు నిర్ణయించారని సమాచారం.