: నిరాశపరిచిన ఆర్బీఐ... మారని వడ్డీరేట్లు!
దేశంలో ద్రవ్య విధానాన్ని మరికాస్త సరళీకృతం చేస్తూ, ఎస్ఎల్ఆర్ (స్టాచ్యుటరీ లిక్విడిటీ రేషియో - చట్టబద్ధమైన ద్రవ్య నిష్పత్తి)ని 50 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్టు ఆర్బీఐ ప్రకటించింది. త్రైమాసిక ద్రవ్య పరపతి సమీక్ష అనంతరం ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ నిర్ణయాలను వెలువరించారు. గత నెలలో కీలక వడ్డీ రేట్లు తగ్గించామని గుర్తు చేసిన ఆయన, ప్రస్తుతానికి రేపో రేటును, నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్ఆర్)లను మార్చడం లేదని తెలిపారు. స్థూల జాతీయ వృద్ధిని పెంచేందుకు కట్టుబడి ఉన్నామని రాజన్ వివరించారు. కాగా, ఆర్బీఐ సమీక్ష తరువాత ఎస్ఎల్ఆర్ 22 శాతం నుంచి 21.5 శాతానికి తగ్గినట్లయింది. బ్యాంకులు మరింతగా రుణాలను మంజూరు చేసే సౌలభ్యాన్ని కలిగించేందుకే ఎస్ఎల్ఆర్ తగ్గించామని రాజన్ తెలిపారు. తదుపరి సమీక్షల్లో వడ్డీ రేట్లు తగ్గించేందుకు ప్రయత్నిస్తామని అన్నారు. ఈ దఫా వడ్డీ రేట్లు మరికాస్త తగ్గవచ్చని అంచనాలు వేసిన పారిశ్రామిక రంగం మాత్రం ఆర్బీఐ తాజా నిర్ణయంతో నిరాశను వ్యక్తం చేసింది.