: ఎర్రగడ్డ చెస్ట్‌ ఆసుపత్రికి 'భయంకర’ వాస్తు దోషం... 15 వీధి పోట్లు!


హైదరాబాదులోని ప్రస్తుత సచివాలయానికి రెండు వీధి పోట్లు ఉన్నాయి. ఈ రెండూ అనర్థమని, ఇంకా వాస్తుదోషాలు ఉన్నాయని సచివాలయాన్ని ఎర్రగడ్డ ఛాతీ వైద్యశాల ఉన్న స్థలానికి తరలించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎర్రగడ్డ స్థలాన్ని పరిశీలించిన వాస్తు నిపుణులు చేదు నిజాలు వెల్లడించారు. ప్రతిపాదిత సచివాలయ స్థలం ‘ఛాతీ ఆసుపత్రి’కి పక్కా వాస్తు లేనే లేదు! ఆ వైపు నుంచి, ఈ వైపు నుంచి ఏకంగా 15 వీధులు సూటిగా దీనిని పొడిచేస్తున్నాయి. రెండు వీధి పోట్ల సచివాలయం అనర్హం అయినప్పుడు 15 వీధి పోట్లు ఎలా మేలు చేస్తుందని నిపుణులు ప్రశ్నించారు. కేసీఆర్‌ చెబుతున్నట్లుగా ఇప్పుడున్న సచివాలయానికి ఎక్కువ వాస్తుదోషం ఉందనుకుంటే, ఛాతీ ఆసుపత్రి స్థలానికి అంతకుమించిన భయంకర వాస్తుదోషం ఉంది. ప్రస్తుత సచివాలయానికి నైరుతి వీధి పోటు ఉంది. దీని ప్రభావం వల్ల పాలకుడికి అధికారులను ప్రశ్నించే తత్వం పెరుగుతుంది. అదే సమయంలో పాలకుడికి అనారోగ్య సమస్యలు ఉంటాయి. దీన్ని సమస్యగా చూపి మొత్తం సచివాలయాన్ని మార్చేయనవసరం లేదని అభిప్రాయపడుతున్నారు. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏమంటే, ఎర్రగడ్డలో 1910 నుంచి కొనసాగుతున్న ఛాతీ ఆస్పత్రి లక్షలాది మందికి రోగాలు నయం చేసింది. అదే సమయంలో, క్షయ తదితర వ్యాధులతో ఎన్నో వేల మంది ఆ ప్రదేశంలోనే చివరి శ్వాస కూడా వదిలారు. ఇలాంటి ప్రదేశాన్ని పాలనా కేంద్రంగా ఉపయోగించుకోవడం శాస్త్రబద్ధమేనా? అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. మరణాలు జరిగిన ప్రాంతాలను పరిపాలనా పరమైన వినియోగాలకు అనర్హంగా భావించాలని కూడా నిపుణులు సూచిస్తున్నారు.

  • Loading...

More Telugu News