: జీతాలివ్వండి మహాప్రభో!: ప్రొద్దుటూరులో వాటర్ ట్యాంక్ ఎక్కిన ఉద్యోగులు


కడప జిల్లా ప్రొద్దుటూరు ప్రభుత్వాసుపత్రి ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు. అందులో భాగంగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందరూ (23 మంది) వాటర్ ట్యాంక్ ఎక్కారు. ఏడు నెలలుగా జీతాలు చెల్లించకుండా చాకిరీ చేయించుకుంటున్నారని వారు ఆరోపించారు. తక్షణం బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. దీంతో, ఆసుపత్రి సూపరిండెంట్, ఆర్ఎంవో వారితో సంప్రదింపులు జరిపి జీతాలు చెల్లిస్తామని చెప్పినా వారు మాట వినలేదు. దీంతో, డీఎస్పీ పూజిత రంగంలోకి దిగి ఉద్యోగులు కిందికి దిగిరావాలని విజ్ఞప్తి చేశారు. అధికారులతో సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని ఆమె సూచించారు. పరిష్కరిస్తామని అధికారులు చాలాసార్లు హామీ ఇచ్చినప్పటికీ అవి నెరవేరలేదని వారు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో, డీఎస్పీ వైద్య విధాన పరిషత్ కమిషనర్ కనకమ్మతో ఫోన్లో మాట్లాడారు. ఆమె హామీ ఇవ్వడంతో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళన విరమించారు.

  • Loading...

More Telugu News