: 'రాజమండ్రి' విషాదంపై విరుచుకుపడిన హీరో శివాజీ
రాజమండ్రి మోరంపూడి జంక్షన్ వద్ద ఓ స్కూలు బస్సు అదుపుతప్పి జనంపైకి దూసుకెళ్లడంతో ముగ్గురు మృతి చెందిన ఘటనపై హీరో శివాజీ ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ఫిట్ నెస్ లేని బస్సుకు అనుమతి ఎలా ఇచ్చారంటూ అధికారులకు, వ్యవస్థను భ్రష్టు పట్టించారంటూ రాజకీయనేతలకు శాపనార్థాలు పెట్టారు. ఈ రాజకీయ నాయకులు ఎప్పుడు పోతారోనంటూ వ్యాఖ్యానించారు. మనకీ రాజకీయనేతలు ఏం సాధించిపెట్టారో అర్థంకావడం లేదన్నారు. ప్రతివాడూ ఉపన్యాసాలు ఇస్తారని మండిపడ్డారు. "ఛీ... వీళ్లసలు మనుషులేనా?" అని ఈసడించుకున్నారు. నిత్యం రద్దీగా ఉండే జంక్షన్లో ట్రాఫిక్ పోలీసులు లేకపోవడం దారుణమని అన్నారు. ఘటనకు లోకల్ పోలీసులు బాధ్యత వహించాలని, ఆ బస్సు... దీక్షకు జనాన్ని తరలిస్తున్నందున జగన్ బాధ్యత వహించాలని, రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యత వహించాలని శివాజీ తీవ్ర స్వరంతో డిమాండ్ చేశారు. కోర్టు ఒక నోటీసు ఇస్తే పరిగెత్తుకుని వెళతారని, వ్యవస్థలో ఆ స్థాయి భయం రావాలని ఆకాంక్షించారు. ఎవరి బాధ్యతలు వాళ్లు కచ్చితంగా నిర్వర్తించి ఉంటే నేడు ఈ ప్రమాదం జరిగివుండేది కాదని అన్నారు. ఇంతకుముందు, తాను మరుగుదొడ్ల గురించి మాట్లాడితే అందరూ విచిత్రంగా చూశారని, ఎవరూ బాధ్యతగా వ్యవహరించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.