: కిరణ్ బేడీ ఢిల్లీని పోలీస్ స్టేషన్ లా మార్చేస్తారు: ఏకే వాలియా
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో రాజకీయ పక్షాల మధ్య వాడీవేడి వాతావరణం నెలకొంది. బీజేపీ సీఎం అభ్యర్థి కిరణ్ బేడీపై కాంగ్రెస్ నేత, లక్ష్మీనగర్ నియోజకవర్గ అభ్యర్థి డాక్టర్ అశోక్ కుమార్ వాలియా విమర్శనాస్త్రాలు సంధించారు. కిరణ్ బేడీ అధికారంలోకి వస్తే ఢిల్లీ నగరాన్ని ఓ పోలీస్ స్టేషన్ లా మార్చేస్తారని అన్నారు. గతంలో కిరణ్ బేడీ ఢిల్లీ ట్రాఫిక్ పోలీసు విభాగంలో చాన్నాళ్లు విధులు నిర్వర్తించారు. డిప్యూటీ కమిషనర్ హోదాలో అక్రమ పార్కింగులపై ఉక్కుపాదం మోపడంతో ఆమెను ఢిల్లీ వాసులు 'క్రేన్ బేడీ' అని పిలిచేవారు. లక్ష్మీ నగర్ నియోజకవర్గంలో 1993 నుంచి నాలుగు సార్లు నెగ్గిన అశోక్ కుమార్ వాలియా ప్రజాగ్రహంతోనే కాంగ్రెస్ ఓటమిపాలైందని, ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ప్రజలను తప్పుదారి పట్టించిందని అన్నారు. ఏడాది కాలంగా ఢిల్లీలో అభివృద్ధి జరగకపోవడంతో ప్రస్తుతం ప్రజలు అసహనంతో ఉన్నారని పేర్కొన్నారు. 2013లో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి వినోద్ కుమార్ బిన్నీ చేతిలో పరాజయం పాలైన వాలియా, ఈసారి విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కిరణ్ బేడీ ప్రతిష్ఠను చూసి తానేమీ కలవరపడడం లేదని అన్నారు. ప్రస్తుతం లక్ష్మీనగర్ నియోజకవర్గంలో బీజేపీ తరపున బీబీ త్యాగి, ఆమ్ ఆద్మీ పార్టీ తరపున నితిన్ త్యాగి బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ తరపున పోటీ చేసిన బిన్నీ ఈసారి బీజేపీ తరపున పట్పార్ గంజ్ నుంచి పోటీ చేస్తున్నారు.