: సినీ నటి రంభ ఆభరణాలు పోయాయట!: వదిన కుటుంబ సభ్యులపై కేసు!
సినీ నటి రంభ బంగారు, వజ్రాల నగలు పోయాయట. ఈ నగలను ఆమె వదిన, అక్కలే కాజేశారని రంభ సోదరుడు శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిన్న బంజారాహిల్స్ పీఎస్ వద్ద అతడు మీడియాకు ఈ విషయం చెప్పాడు. నగల దొంగతనంపై చెన్నైలోని విరువుంబాక్కం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్టు అతడు తెలిపాడు. తన భార్య పల్లవి, ఆమె సోదరి శాంతిసింగ్‌చౌహాన్, జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్ రవికిరణ్ (పల్లవి సోదరుడు), ఆయన భార్య వాణిజ్య పన్నుల శాఖాధికారిణి సంయుక్త తదితరులు కలిసి రంభకు చెందిన రూ. 4.5 కోట్ల విలువైన ఆభరణాలు కాజేశారని చెప్పాడు. అంతే కాకండా గతంలో తనపై, తన కుటుంబ సభ్యులపై అకారణంగా వరకట్న వేధింపుల కేసు పెట్టారని ఆరోపించాడు. తన కుమారుడిని ఏడాదిగా చూపించడం లేదని పశ్చిమ మండలం డీసీపీకి ఫిర్యాదు కూడా చేశానని, ఆ కేసు విషయమై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కూడా ఫిర్యాదు చేస్తున్నట్లు అతడు వెల్లడించాడు. మూడేళ్ల నుంచి రంభ కెనడాలో ఉందని ఇటీవల రెండు నెలలు ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిందని తెలిపాడు. గతంలో తాము ఇక్కడ లేని సమయంలో బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో తమపై కేసు పెట్టారని... పల్లవి, శాంతిసింగ్ చౌహాన్, ఆమె సోదరుడు రవికిరణ్, సంయుక్తలపై చెన్నైలో తొలుత తామే ఫిర్యాదు చేశామని తెలిపాడు.