: నిన్నటిదాకా ఏం చేశారో తెల్వదు... ఇకపై నిద్ర పోతామంటే కుదరదు: అధికారులకు కడియం హెచ్చరిక
‘‘నిన్నటిదాకా నిద్రపోయారో, ఏం చేశారో కూడా నాకు తెల్వదు. ఇకపై నిద్రపోతామంటే మాత్రం కుదరదు. నగరాన్ని ఎంతో అభివృద్ధి చేయాలని సీఎం కేసీఆర్ అనుకుంటున్నారు. అందుకు తగ్గట్టు పని చేయాలే’’ అని తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. నిన్న వరంగల్ నగరపాలక సంస్థ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే డిప్యూటీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన ఆయన, వెనువెంటనే తనదైన రీతిలో దూసుకుపోతున్నారు. ఇటీవల సీఎం కేసీఆర్ నాలుగు రోజుల పాటు వరంగల్ లో పర్యటించిన సంగతి తెలిసిందే. పర్యటనలో భాగంగా కేసీఆర్ పలు హామీలను ప్రకటించారు. సీఎం ప్రకటించిన హామీలన్నింటి అమలు కోసం పక్కాగా కార్యాచరణ ప్రణాళికలను రూపొందించాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. 15 రోజుల్లోగా సదరు నివేదికలు తనకందజేయాలని కడియం అధికారులకు దిశానిర్దేశం చేశారు.