: గుజరాత్ డీడీలో జశోదాబెన్ వార్త ప్రసారం... అండమాన్ కు ఉద్యోగి బదిలీ!


ప్రధానమంత్రి నరేంద్రమోదీ భార్య జశోదాబెన్ వార్త ప్రసారం చేశాడన్న కారణంగా ఓ దూరదర్శన్ ఉద్యోగిపై బదిలీ వేటు పడింది. ఏకంగా అండమాన్ కు పంపిస్తున్నట్టు గుజారాతీ డీడీ అధికారులు ఉత్తర్వులిచ్చారు. మరిన్ని వివరాల్లోకి వెళితే, వీఎం వానొల్ (58) అనే వ్యక్తి గుజరాత్ దూరదర్శన్ ఛానల్ లో పనిచేస్తున్నాడు. ఇంకో సంవత్సరంలో రిటైర్ కానున్నాడు. ఈలోగానే రెండు నిమిషాలకు తక్కువగా ఉన్న ఓ ఐటమ్ ను డీడీ గిర్నార్ లో ప్రసారం చేశాడని ఈ నెల రెండోవారంలో అతడు బదిలీ కావల్సి వచ్చింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ భార్యగా తనకు కల్పించిన పోలీసు రక్షణపై వివరాలు తెలపాలంటూ జశోదాబెన్ ఆర్టీఐ పిటిషన్ లో కోరారు. దేశ వ్యాప్తంగా ఈ విషయం మీడియాలోనూ వచ్చింది. ఈ వార్తనే ఆ ఉద్యోగి కూడా ప్రసారం చేశాడు. అయితే వానొల్ ను బదిలీ చేయడంపై స్పష్టత ఇవ్వాలంటూ కేంద్ర సమాచార ప్రసార శాఖకు ఓ ఆంగ్ల దినపత్రిక ప్రశ్నావళి పంపింది. అతడి బదిలీపై ఎడిటోరియల్, అడ్మినిస్ట్రేటివ్ విభాగం నిర్ణయం తీసుకుందని, ఎలాంటి నిర్దిష్టమైన కారణం పేర్కొనలేదని ఆ మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అటు తాను పోర్ట్ బ్లెయిర్ స్టేషన్ కు బదిలీ అయిన విషయాన్ని వానొల్ కూడా ధ్రువీకరించాడు. తన బదిలీకి దారితీసిన వివరాలు చెప్పేందుకు నిరాకరించాడు.

  • Loading...

More Telugu News