: అమ్మాయిలతో నకిలీ నోట్ల చలామణి... పోలీసుల అదుపులో నలుగురు


టైలరింగ్ షాపు ముసుగులో తన వద్ద పనిచేసే అమ్మాయిలనే ఏజెంట్లుగా పెట్టుకొని నకిలీ నోట్లను గుట్టుచప్పుడు కాకుండా చలామణి చేయిస్తున్న హైదరాబాద్ ముషీరాబాద్‌ కు చెందిన లక్ష్మీనారాయణ (42) వ్యవహారాన్ని పోలీసులు రట్టు చేశారు. ప్రధాన సూత్రధారితో పాటు ముగ్గురు యువతులను కూడా అరెస్ట్ చేసి కటకటాల్లోకి నెట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ముషీరాబాద్‌ పరిధిలోని ప్రశాంతి టవర్స్‌ లో లక్ష్మీనారాయణ లలితా ఎంటర్‌ప్రైజెస్ పేరిట టైలరింగ్ షాపు నిర్వహిస్తున్నాడు. అతనివద్ద ఇ.అనిత (24), కె.సరిత(24), జి.హారిక(22)లు పని చేస్తున్నారు. వీరికి ఎక్కువ కమిషన్ ఇచ్చి, 500, 1000 రూపాయల నోట్లతో చిన్న చిన్న వస్తువులను కొనుగోలు చేయిస్తూ నకిలీ నోట్లను మార్పిడి చేయిస్తున్నాడు. ఆసిఫ్‌ నగర్ జిర్రా ప్రాంతంలో లక్ష్మీనారాయణ బైక్‌పై అనుమానాస్పదంగా తిరుగుతుండగా టప్పాచబుత్ర పోలీసులు అదుపులోకి తీసుకొని తనిఖీ చేయగా రూ.36 వేల నకిలీ నోట్లు బయటపడ్డాయి. దీంతో అతనిని తమదైన శైలిలో విచారించగా, తనకు అనంతపురానికి చెందిన శ్రీనాథ్‌రెడ్డి నకిలీ నోట్లు అందిస్తున్నట్లు వెల్లడించాడు. శ్రీనాథ్‌రెడ్డిని కూడా త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News