: సామాన్యులకు మరింత వెంకన్న ప్రసాదం... వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోనూ లడ్డూ కౌంటర్లు
తిరుమల శ్రీవేంకటేశుని దర్శనానికి వెళ్ళే సామాన్య భక్తులకు మరిన్ని లడ్డూలు ఇవ్వాలని టీటీడీ నిర్ణయించింది. ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో సామాన్య భక్తులకు సబ్సిడీ ధరకు ఒక్కొక్కటి రూ.10 చొప్పున రెండు లడ్డూలు ఇస్తుండగా, వీటితోపాటు ఒక్కొక్కటి రూ.25 చొప్పున మరో రెండు లడ్డూలు ఇవ్వాలని నిర్ణయించింది. సర్వదర్శనం క్యూలో వెళ్లే భక్తులకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో ఒక్కొక్కటి రూ.10 చొప్పున రెండు లడ్డూ టోకెన్లు, కాలిబాటలో నడిచివచ్చిన భక్తులకు ఒక లడ్డూ ఉచితంగా, ఒక్కొక్కటి రూ.10 చొప్పున రెండు లడ్డూ టోకెన్లు ఇస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆలయం వెలుపల నిర్వహిస్తున్న అదనపు లడ్డూ కౌంటర్ వంటిదే వైకుంఠం కాంప్లెక్స్ లోనూ ప్రారంభించి భక్తులకు ఒక్కొక్కటి రూ.25 చొప్పున రెండు లడ్డూలు ఇవ్వాలని టీటీడీ నిర్ణయించింది. దీంతో దర్శనానికి వెళ్లి వచ్చిన తరువాత సామాన్య భక్తులకు కనీసం గంట సమయం ఆదా కానుంది. కాగా, అదనపు కవర్ల కోసం భక్తుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ఉచిత కవర్ల విధానాన్ని టీటీడీ ఉపసంహరించుకుంది. లడ్డూ కవర్లు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించిన రెండు రోజుల వ్యవధిలోనే ఆ నిర్ణయం వెనక్కు తీసుకుని, నిన్న సాయంత్రం నుంచి రూ. 2 విలువైన కవర్ల విక్రయాన్ని తిరిగి ప్రారంభించింది.