: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అమెరికా కోర్టు నోటీసులు


ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని రెండు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించిన వివరాలను అందజేయాలని అమెరికాలోని ఓహియో న్యాయస్థానం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. అమెరికాతో చేసుకున్న ఒప్పందాల ప్రకారం విదేశీ న్యాయస్థానం కోరిన వివరాలు అందించాల్సిందేనని న్యాయశాఖ నిపుణులు స్పష్టం చేయడంతో, ఆ వివరాలను సమీకరించే పనిలో నీటిపారుదలశాఖ అధికారులు తలమునకలయ్యారు. అమెరికాలో రెండు ప్రైవేటు సంస్థల మధ్య దాఖలైన కేసులో భారత్‌లోని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేర్చడంతోనే ఈ నోటీసులు జారీ అయినట్టు తెలుస్తోంది. పదేళ్లనాడు మొదలైన ఎలిమినేటి మాధవరెడ్డి (ఏఎంఆర్) ప్రాజెక్టులో 43.5 కి.మీ మేర, పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టులో 19.2 కి.మీ మేర సొరంగం నిర్మించే కాంట్రాక్టు అమెరికాకు చెందిన ద రాబిన్స్ కంపెనీకి అప్పగించడం జరిగింది. ఈ పనిలో రాబిన్స్ కంపెనీకి తానూ సాంకేతిక సహకారం అందించానని, తనకు ఇవ్వాల్సిన ఫీజులు ఇవ్వలేదని ఓహియో కోర్టులో కృష్ణ శ్రీవాస్తవ అనే వ్యక్తి కేసు దాఖలు చేశారు. ఆ ప్రాజెక్టులతో శ్రీవాస్తవకు సంబంధంలేదని రాబిన్స్ కంపెనీ చెప్పగా, దీన్ని సవాల్ చేస్తూ శ్రీవాస్తవ మరో పిటిషన్ వేశారు. ప్రాజెక్టుల దస్త్రాలు పరిశీలిస్తే విషయం తెలుస్తుందని ఆయన చెప్పడంతో సంబంధిత నివేదికలు అందించమని ఓహియో కోర్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

  • Loading...

More Telugu News