: బిన్నీ ధాటికి ఇంగ్లాండ్ మిడిలార్డర్ అతాలకుతలం
చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్ లో భారత బౌలర్ స్టూవర్ బిన్నీ సత్తా చాటాడు. 201 పరుగుల విజయలక్ష్యంతో బరిలో దిగిన ఇంగ్లాండ్ జట్టు బిన్నీ ధాటికి 66 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. బిన్నీ నిప్పులు చెరగడంతో రూట్ (3), కెప్టెన్ మోర్గాన్ (2), బొపారా (4) రెండంకెల స్కోరు నమోదు చేయకుండానే పెవిలియన్ చేరారు. అంతకుముందు, ఇంగ్లాండ్ ఓపెనర్ బెల్ (10) ను ఇషాంత్ శర్మ అవుట్ చేయగా, అలీ (17)ని అక్షర్ పటేల్ బలిగొన్నాడు. ప్రస్తుతం టేలర్ 35 పరుగులతోనూ, బట్లర్ 15 పరుగులతోనూ ఆడుతున్నారు. ఇంగ్లాండ్ జట్టు 25 ఓవర్ల అనంతరం 5 వికెట్లకు 92 పరుగులతో ఉంది. ఆ జట్టు గెలవాలంటే 25 ఓవర్లలో 109 పరుగులు చేయాలి. చేతిలో ఐదు వికెట్లు ఉన్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా 200 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే.