: కేజ్రీ, కాసుకో... రోజుకు 5 ప్రశ్నలు సంధిస్తాం!: బీజేపీ


ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. దీంతో ప్రధాన పార్టీలు బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ లు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనగా, నిన్న కాంగ్రెస్ అభ్యర్థుల ప్రచారంలో ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా పాలుపంచుకున్నారు. ఇక ఆప్ మాత్రం ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందు నుంచే ప్రచార హోరును కొనసాగిస్తోంది. మాజీ ఐపీఎస్ అధికారిణి కిరణ్ బేడీని సీఎం అభ్యర్థిగా ప్రకటించిన బీజేపీ, ఎన్నికల్లో విజయం కోసం సర్వశక్తులూ ఒడ్డుతోంది. ఇందులో భాగంగా ఎన్నికల్లో హాట్ ఫేవరేట్, తాజా మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై ప్రత్యక్ష పోరుకు సిద్ధమైంది. ‘‘కేజ్రీవాల్, రోజుకు ఐదు ప్రశ్నలు సంధిస్తాం. వాటికి సమాధానం చెప్పు’’ అంటూ ఆ పార్టీ ప్రకటించింది. వెంటనే, నిన్న తొలి రోజు ఐదు ప్రశ్నలను ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి రాజీవ్ ప్రతాప్ రూడీ విడుదల చేశారు. కాంగ్రెస్ మద్దతు, జడ్ ప్లస్ కేటగిరీ భద్రత, మాజీ సీఎం షీలా దీక్షిత్ పై దర్యాప్తు, మంత్రులకు అత్యాధునిక వాహనాల ఏర్పాటు, విమానాల్లో బిజినెస్ క్లాసు ప్రయాణాలపై సమాధానం చెప్పాలంటూ ఆయన కేజ్రీవాల్ కు సవాల్ విసిరారు. మరి ఈ ప్రశ్నలకు కేజ్రీవాల్ ఎలా స్పందిస్తారో చూడాలి. మరోవైపు వచ్చే నెల 5 దాకా రోజూ ఐదు ప్రశ్నలను కేజ్రీవాల్ కు సంధించనున్నట్లు రూడీ వెల్లడించారు.

  • Loading...

More Telugu News