: టీ డబ్బులడిగినందుకు గొడ్డలితో దాడి... కడపలో టీ కొట్టు యజమాని మృతి
చిన్నపాటి విషయాలకు కూడా కత్తులు, కటార్లు స్వైర విహారం చేసే కడపలో కొద్దిసేపటి క్రితం దారుణం చోటుచేసుకుంది. టీ డబ్బులు అడిగినందుకు ఓ వ్యక్తి గొడ్డలితో దాడికి దిగాడు. ముందూ, వెనుకా చూడకుండా తనను డబ్బులడిగిన టీకొట్టు యజమానిపై విరుచుకుపడ్డాడు. ఊహించని ఘటనలో తీవ్ర గాయాలపాలైన టీ కొట్టు యజమానిని స్థానికులు రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడు. నేటి ఉదయం తీవ్ర కలకలం రేపిన ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని, దాడి చేసిన వ్యక్తి కోసం గాలింపు చేపట్టారు.