: నాంపల్లి కోర్టులో జగన్, గాలి జనార్ధన్ రెడ్డి... వేర్వేరు కేసుల్లో కోర్టుకు హాజరు


వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డిలు కొద్దిసేపటి క్రితం హైదరాబాదు, నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు. ఓబుళాపురం మైనింగ్ కేసులో గాలి జనార్ధన్ రెడ్డి కోర్టుకు హాజరు కాగా, అక్రమాస్తుల కేసులో జగన్ కోర్టుకు వచ్చారు. తెలుగు రాష్ట్రాలనే కాక యావత్తు దేశంలోనే సంచలనం రేపిన అవినీతి కుంభకోణాలకు సంబంధించి నెలల వ్యవధిలో జగన్, గాలిపై సీబీఐ కేసులు నమోదు చేసింది. కేసుల్లో ఇరుక్కున్న జగన్ 16 నెలల పాటు జైల్లో గడిపి రాగా, గాలి మాత్రం సుదీర్ఘకాలం పాటు జైలు జీవితం గడిపి ఇటీవలే బెయిల్ పై విడుదలయ్యారు. కేసులు నమోదయ్యేదాకా ఇరువురు నేతల మధ్య సన్నిహిత సంబంధాలు కొనసాగినా, కేసుల నేపథ్యంలో గాలి జనార్దన్ రెడ్డి తనకేమీ బంధువు కాదని పార్లమెంట్ వద్ద జగన్ వ్యాఖ్యానించారు. తాజాగా కొద్దిసేపటి క్రితం వేర్వేరు కేసుల్లో నిందితులుగా ఉన్న వారిద్దరూ ఒకే సమయంలో కోర్టుకు హాజరుకావడం గమనార్హం. ఒకే సమయంలో కోర్టుకు వచ్చిన వారిద్దరి మధ్య మాట కలిసిన విషయం తెలియరాలేదు. ఈ రెండు కేసుల విచారణ నిమిత్తం జగన్, గాలిలతో పాటు మాజీ మంత్రులు ధర్మాన, మోపిదేవి, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాసరెడ్డి కూడా కోర్టుకు వచ్చారు. ఇదిలా ఉంటే, ఓఎంసీ కేసు విచారణను ఫిబ్రవరి 19కి వాయిదా వేసిన కోర్టు, జగన్ అక్రమాస్తుల కేసును మార్చి 6కు వాయిదా వేసింది.

  • Loading...

More Telugu News