: ఎన్ టీవీ ప్రసారాల నిషేధంపై హైకోర్టు స్టే: కౌంటర్ దాఖలు చేయాలని కేంద్రానికి ఆదేశం
తెలుగు న్యూస్ ఛానెల్ ఎన్ టీవీ ప్రసారాలపై కేంద్రం అమలు చేయనున్న నిషేధాన్ని ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టు నిలుపుదల చేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ భట్టి కేంద్రం ఉత్తర్వులపై స్టే విధించారు. ఎన్ టీవీలో రాత్రి 11.30 గంటలకు ప్రసారమవుతున్న కలర్స్ కార్యక్రమంలో అశ్లీలత ఉందని చెప్పిన కేంద్రం, వచ్చే నెల 3 నుంచి 10 వరకు ఎన్ టీవీ ప్రసారాలపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను ఎన్ టీవీ యాజమాన్యం హైకోర్టులో సవాల్ చేసింది. ఎన్ టీవీ పిటిషన్ ను విచారించిన హైకోర్టు న్యాయమూర్తి కేంద్రం ఉత్తర్వులను నాలుగు వారాలపాటు నిలిపివేస్తున్నట్లు తీర్పు చెప్పారు. అంతేకాక ఈ విషయానికి సంబంధించిన సమగ్ర వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు నోటీసులు జారీ చేశారు.