: చంద్రబాబుతో ముఖేష్ గౌడ్ భేటీ... సనత్ నగర్ లో వియ్యంకుల మధ్యే పోటీ?
తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ తన ఎమ్మెల్యే పదవికి చేసిన రాజీనామాతో ఖాళీ కానున్న సనత్ నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో వియ్యంకుల మధ్య పోటీ తప్పేలా లేదు. తలసానితో ఆయన వియ్యంకుడు, మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ తలపడేందుకు సిద్ధమవుతున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కాదట. తలసాని వదిలేసి వచ్చిన టీడీపీ అభ్యర్థిగా ఆయనపై పోటీకి దిగేందుకు ముఖేష్ సిద్ధపడుతున్నారు. ఈ మేరకు ముఖేష్ నిన్న టీడీపీ సీనియర్ దేవేందర్ గౌడ్ తో కలిసి ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడితో భేటీ అయ్యారు. సనత్ నగర్ ఉప ఎన్నికకు పార్టీ తరఫున తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలన్న ముఖేష్ ప్రతిపాదనకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ముఖేష్ గౌడ్ సోదరుడి కుమార్తెను తలసాని కుమారుడు వివాహం చేసుకున్నారు. దీంతో ముఖేష్ గౌడ్, తలసాని వియ్యంకులయ్యారు. తాజాగా సనత్ నగర్ ఉప ఎన్నికలో ముఖేష్ బరిలోకి దిగితే వియ్యంకుల మధ్య పోటీ రసవత్తరంగా కొనసాగనుంది.