: అదే మన జాతి బలం: ప్రధాని మోదీ
భిన్నత్వంలో ఏకత్వమే మన జాతి బలం అని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. మనకు ఎప్పుడూ ప్రేరణ కలిగించేది ఈ అంశమేనని అన్నారు. ఢిల్లీలో ఓ ఎన్సీసీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కనిపించిన బాలికా క్యాడెట్లను చూసి ఆయన సంతోషించారు. గణతంత్ర దినోత్సవ పెరేడ్ ను 'స్త్రీ శక్తి'కి అంకితమిచ్చామని తెలిపారు. ఎన్సీసీ సేవలను కొనియాడుతూ, తానిప్పుడో మినీ ఇండియా ముందు నిలుచుని ఉన్నానని అన్నారు. "మనదేశం వైవిధ్యాలమయం. మనదేశ బలం, సౌందర్యం భిన్నత్వంలో ఏకత్వమే" అని వివరించారు. ఇక, రక్షణ మంత్రి మనోహర్ పారికర్, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్, రక్షణ శాఖ సహాయ మంత్రి రావు ఇందర్ జిత్ సింగ్, బీజేపీ ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్ బేడీ, నటి, ఎంపీ జయా బచ్చన్... వీరందరూ ఎన్సీసీ కేడెట్లేనని ప్రధాని మోదీ వెల్లడించారు. తాను కూడా ఎన్సీసీ కేడెట్ నే అని, అయితే, ఢిల్లీలో పెరేడ్ కు మాత్రం ఎప్పుడూ ఎంపిక కాలేదని తెలిపారు. ఎన్సీసీలో అమ్మాయిలు పెద్ద సంఖ్యలో చేరాలని ఈ సందర్భంగా ప్రధాని పిలుపునిచ్చారు.