: సీపీఎం అభ్యర్థిగా ఎమ్మెల్సీ బరిలో టీజేఏసీ చైర్మన్ కోదండరాం?
తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించడమే కాక ప్రత్యేక రాష్ట్ర సాధనలో తనవంతు బాధ్యతలను నెరవేర్చిన తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ (టీజేఏసీ) చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, ఆ తర్వాత తిరిగి తన ఉద్యోగంలో చేరిపోయారు. అయితే, ఇటీవల పలు కార్యక్రమాల్లో చురుకుగా పాలుపంచుకుంటున్న ఆయన, కేసీఆర్ సర్కారుపై ఘాటైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న పలు విధాన నిర్ణయాలపై ఆయన నిరసన గళం వినిపిస్తున్నారు. ఇదిలా ఉంటే, ఉద్యమంలో కీలక భూమిక పోషించిన ఆయనకు కేసీఆర్ పెద్ద పదవినే ఆఫర్ చేశారట. అయితే, దానిని కోదండరాం తిరస్కరించినట్లు వార్తలొచ్చాయి. తాజాగా, కోదండరాంను ఎన్నికల బరిలో నిలిపేందుకు సీపీఎం రంగంలోకి దిగింది. త్వరలో రాష్ట్రంలో జరగనున్న పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలని సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, కోదండరాంను కోరారట. అయితే, ఎన్నికల్లో పోటీపై కోదండరాం ఆసక్తి చూపలేదని సమాచారం. కోదండరాం ఒప్పుకుంటే పార్టీ తరఫున ఆయనను బరిలోకి దింపేందుకు సిద్ధంగానే ఉన్నామని సీపీఎం నేతలు చెబుతున్నారు.